హుస్నాబాద్ ను విద్యాహబ్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి పొన్నం
హుస్నాబాద్ ను విద్యాహబ్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి పొన్నం
మంత్రి


హుస్నాబాద్, 31 ఆగస్టు (హి.స.)

హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యాహబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉమ్మాపూర్ లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల నూతన హాస్టల్ భవనాలకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి రూ.7.28 కోట్ల చొప్పున మొత్తం రూ.14.56 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. హుస్నాబాద్కు ఇంజినీరింగ్ కళాశాల కావాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి మంజూరు చేశారని మంత్రి చెప్పారు.

కేబినెట్ ఆమోదం, స్థల ఎంపిక అనంతరం కళాశాల భవనాలకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఇప్పటికే కళాశాల భవనాలకు శంకుస్థాపన జరిగిందని, తాజాగా హాస్టళ్లకు కూడా శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. మొదటి ఏడాది 60 మంది విద్యార్థులకు సైకిళ్లు, ల్యాప్టాప్లు అందించామని, ప్రస్తుతం రెండో సంవత్సరంలో 120 మంది చేరారని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి, వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలను పూర్తి స్థాయి విద్యార్థులతో నింపుతామని అన్నారు. హాస్టల్లో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, త్వరలో రెండు బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. విద్యార్థులు మంచి మార్కులు, ర్యాంకులు సాధించి ఉద్యోగాలతో బయటకు వెళ్లాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు తాను ఎమ్మెల్యేగా కాకుండా గార్డియన్గా అండగా ఉంటానన్నారు. కళాశాలకు అప్రోచ్ రోడ్డు, వీధి దీపాల ఏర్పాటు చేపడతామని చెప్పారు. కోహెడ, తంగళ్లపల్లిలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, సైదాపూర్లో మరో పాఠశాల, హుస్నాబాద్లో కబడ్డీ అకాడమీ, క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande