నవశకానికి పారిశ్రామిక ప్రగతి
డిసెంబరు 7-9 తేదీల్లో కొత్త పాలసీలను ప్రకటించనున్న సీఎం ‘ఇండస్ట్రియల్ పాలసీ 2.0.
Industrial policy


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)

పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే సామర్థ్యమున్న ‘ఫుట్వేర్-లెదర్, అప్పెరల్, లైఫ్ స్టైల్’ ఉత్పత్తుల తయారీ రంగాలను ప్రోత్సహించే విధంగా వేర్వేరుగా కొత్త పాలసీలను తీసుకురానున్నారు. ఈ రంగాలను హైదరాబాద్ వెలుపల జిల్లాలకు తీసుకెళ్లడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేది సర్కారు లక్ష్యం. ముడిసరకు నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు, తయారీ, ప్యాకేజింగ్, ఎగుమతుల వరకు పూర్తి సరఫరా గొలుసును తెలంగాణలోనే అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టనున్నారు.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా ఎదిగింది. దాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, క్లౌడ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి అధిక విలువ కలిగిన కార్యకలాపాలను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’లో సేవా రంగ పెట్టుబడులతో పాటు అధిక నైపుణ్య ఉద్యోగావకాశాలను పెంపొందించే కీలక స్తంభంగా జీసీసీ పాలసీ నిలవనుంది.

ఏఐ, క్లౌడ్, డిజిటల్ సేవల విస్తరణతో డేటా సంబంధిత మౌలిక వసతులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. డేటా సెంటర్స్ పాలసీకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. డేటా సెంటర్లు ప్రత్యక్షంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను ఇవ్వకపోయినా..వాటి చుట్టూ క్లౌడ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అనుబంధ రంగాలు విస్తరించే అవకాశం ఉంది.

పరిశ్రమలకు రవాణా వ్యయాన్ని తగ్గించడం, ఎగుమతులను సులభతరం చేయడంలో లాజిస్టిక్స్ పాలసీ కీలకంగా మారనుంది. దీని ద్వారా డ్రైపోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్లు, గిడ్డంగులు, కోల్డ్చైన్లు, ఆధునిక రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టనున్నారు. పరిశ్రమ స్థాపన నుంచి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేసే వరకు పూర్తి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలనేది ధ్యేయం.

ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఆటోమొబైల్ పరిశ్రమ కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఆటోమొబైల్ తయారీ రంగం అభివృద్ధి చెందకపోవడాన్ని ప్రభుత్వం సవాలుగా చూస్తోంది. కార్లు ఉత్పత్తిచేసే పెద్ద ఆటో మొబైల్ తయారీ సంస్థలతో పాటు ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఆటో కాంపోనెంట్స్ వంటి అనుబంధ పరిశ్రమలను ఆకర్షించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande