
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు నేడు తెలంగాణ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఢిల్లీ ఆందోళనల్లో విద్యార్థులపై కాల్పులు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను అవమానించారంటూ ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, బీజేపీ ఆఫీస్ గేటుకు నల్లరంగు పూశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆందోళనకారులను పోలీసు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అయితే ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద యూత్ కాంగ్రెస్ ఘటనపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు లేకపోవడంపై ఆరా తీశారు. పట్టపగలు బీజేపీ ఆఫీస్పై దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు