
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)
కోల్కతాలో నమోదైన భారీ బొగ్గు
కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోనూ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ ఏఎంఆర్ (AMR) సంస్థ కార్యాలయాలు, సంబంధిత వ్యక్తుల నివాసాలలో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపూట్టారు.
కేవలం హైదరాబాద్ (Hyderabad) లోనే కాకుండా, ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, కోల్కతా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈడీ అధికారులు మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు సిండికేట్, అక్రమ లావాదేవీలు, నిధుల మళ్లింపు కోణంలో ఈ తనిఖీలు సాగుతున్నట్లుగా సమాచారం. కాగా, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్-అసన్సోల్ ప్రాంతంలో జరిగిన భారీ స్థాయి అక్రమ కోలరీ మైనింగ్, రవాణా, వసూళ్ల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్యలు తీసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక కోర్టులో ఐదుగురు నిందితులపై ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధానంగా అరెస్టయిన చిన్మయ్ మోండల్, కిరణ్ ఖాన్లతో పాటు మరో ముగ్గురి పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు