

తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)
నిరంకుశత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా ప్రాణాలర్పించి పోరాడిన ధీరులకు నిలయం తెలంగాణ మట్టి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 'ప్రజాపాలన దినోత్సవం' ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్ అమరవీరుల స్మారక స్థూపం చేరుకుని పోరాట వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
తెలంగాణ పోరాట ప్రస్థానంలో సెప్టెంబర్ 17వ తేదీకి తిరుగులేని చారిత్రక ప్రాధాన్యం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నిజాం ఏలుబడిలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, దౌర్జన్యాలు విపరీతంగా సాగాయని గుర్తుచేశారు. ఆ తదనంతర కాలంలో రజాకార్ల భయానక అరాచకాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని తెలిపారు.
ఈ దారుణ పాలన నుంచి విముక్తి పొంది, భారత యూనియన్‌లో భాగం కావాలనే బలమైన కాంక్ష తెలంగాణ జనాల్లో రగిలిందని చెప్పారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, నిజాం ఆంధ్ర మహాసభల ఆధ్వర్యంలో విముక్తి ఉద్యమాలు ఊపందుకున్నాయని వివరించారు. రజాకార్ల దౌర్జన్యాలను అడ్డుకుంటూ భూమి, భుక్తి, ప్రజా స్వేచ్ఛ కోసం కమ్యూనిస్టులు మహత్తర పోరాటం సాగించారని ప్రశంసించారు. రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ వంటి ధీరోదాత్త నాయకులు ఈ ఉద్యమాలకు ముందుండి నాయకత్వం వహించడం తెలంగాణ జాతికే గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్