
అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని పూర్తి అప్రమత్తం చేశారు. వరద ముప్పు ఉన్న జిల్లాల కలెక్టర్లు అలాగే ముఖ్య అధికారులతో అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు, ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వాతావరణం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు.
ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అలాగే నదులలో పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగకుండా పూర్తి ప్రణాళికతో వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని తేల్చి చెప్పారు.
వరద బాధితులకు పునరావాస కేంద్రాలలో నాణ్యమైన భోజనం, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా అందేలా చూసుకోవాలని ఆదేశించారు. భారీ ఈదురు గాలుల కారణంగా ఎక్కడైనా చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు విరిగిపడితే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. వర్షాలు పూర్తిగా తగ్గిన వెంటనే దెబ్బతిన్న పంటల వివరాలపై అంచనా వేసి, నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున తగిన అండదండలు అందిస్తామని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్