
తిరుపతి, 24 సెప్టెంబర్ (హి.స.)తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు మరియు పిల్లలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ‘ఆపరేషన్ త్రిశూల్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా ‘Drugs Vaddu Bro’ అనే సందేశంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ‘Eagle’ పేరుతో పోస్టర్లను విడుదల చేశారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు.
మహిళలు, పిల్లలపై నేరాలను అరికట్టేందుకు ఫిర్యాదులను వేగంగా స్వీకరించడం, బాధితులకు సహాయం అందించడం, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పోలీసు, రెవెన్యూ, విద్యా, వైద్య, రవాణా తదితర శాఖల సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్