
అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.)ఉత్తరాంధ్రలో తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విమాన రాకపోకలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు సమస్యగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పలు విమానాలు దారి మళ్లించగా, కొన్ని సర్వీసులు రద్దు చేశారు.
బలమైన గాలులు, భారీ వర్షం, దృశ్యమానతలో మార్పులు ఉన్నప్పుడు విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ప్రక్రియలో అదనపు జాగ్రత్తలు అవసరం. అందుకే వాతావరణ పరిస్థితులను బట్టి విమాన సంస్థలు, ఎయిర్పోర్టు అధికారులు సర్వీసులపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి మళ్లించడం సాధారణంగా తీసుకునే ముందస్తు భద్రతా చర్యల్లో ఒకటి.
విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరాల్సిన ఇండిగో విమానాన్ని వాతావరణం సహకరించకపోవడంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని భద్రతా కారణాల రీత్యా బెంగళూరుకు తరలించారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఎయిర్‌పోర్టులకు బయలుదేరే ముందు ప్రతి ఒక్కరూ తమ విమానాల తాజా సమయాలను ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థల ద్వారా సరిచూసుకోవాలని విమానాశ్రయ నిర్వహణ వర్గాలు ప్రత్యేక విజ్ఞప్తి చేశాయి.
ఉత్తరాంధ్రలో పరిస్థితి కారణంగా రోడ్డు రవాణాపైనా ప్రభావం కనిపిస్తోంది. విజయవాడలో కూడా గత 24 గంటల్లో వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 627.8 మిల్లీమీటర్ల మొత్తం వర్షపాతం నమోదైనట్లు, జిల్లా సగటు 31.39 మిల్లీమీటర్లుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తిరువూరులో 99 మిల్లీమీటర్లు, రెడ్డిగూడెంలో 62.6 మిల్లీమీటర్లు, విస్సన్నపేటలో 55.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో ప్రధానంగా రోడ్లు తడిగా, బురదగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దఎత్తున నీటిమునక పరిస్థితి లేకపోయినా, రోడ్లపై జారుడు పరిస్థితి ఏర్పడింది. డ్రెయిన్లలో నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లను పర్యవేక్షించాలని విజయవాడ మున్సిపల్ అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్