
అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు కొనసాగుతున్న మూడు రోజుల సంయుక్త అధ్యయన మిషన్లో భాగంగా ఈ సమీక్ష జరుగుతోంది. ప్రాజెక్టుల భౌతిక పురోగతితో పాటు ఆర్థిక నిర్వహణ, టెండర్లు, కాంట్రాక్టులు, పరిపాలనా వ్యవస్థ తదితర అంశాలను అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పరిశీలిస్తున్నారు.
రాయపూడిలోని APCRDA కార్యాలయంలో అధికారులతో ప్రతినిధులు సమావేశమయ్యారు.
అమరావతి ప్రాంతంలో వివిధ మౌలిక వసతుల ప్యాకేజీల పనులు ఏ దశలో ఉన్నాయి, టెండర్ ప్రక్రియ ఎలా సాగుతోంది, కాంట్రాక్టుల అమలు ఎలా ఉంది వంటి అంశాలను అధికారులు వివరించారు.
సమావేశాల్లో Integrated Capital Region వ్యవస్థ, పట్టణ పాలన, ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమాలు, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కేవలం రహదారులు, భవనాలకు పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక మౌలిక వసతులతో అనుసంధానం చేయాల్సిన అంశాన్ని కూడా ప్రతినిధులు పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్