హైదరాబాద్-శ్రీశైలం వెళుతున్న ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. 38 మంది భక్తులు సురక్షితం
హైదరాబాద్-శ్రీశైలం వెళుతున్న ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. 38 మంది భక్తులు సురక్షితం
బస్సు


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తెల్లవారుజామున అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది భక్తులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంద మల్లమ్మ ఎక్స్ రోడ్డు (కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయం సమీపంలో) ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి సుమారు 150 మంది భక్తులతో బయలుదేరిన మూడు బస్సుల కాన్వాయ్‌లో ఈ బస్సు ఒకటి. ఈ కాన్వాయ్‌లోని రెండు బస్సులు సమీపంలోని పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకుంటున్న సమయంలో, ప్రధాన రహదారిపై ఆగి ఉన్న మూడో బస్సు ఇంజిన్ కుడి వైపు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

బస్సు నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande