రాముడు, శివుడిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం.. బీజేపీ తీవ్ర ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
BJP


హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల మధ్య మత, సాంస్కృతిక గుర్తింపులపై ఆయన చేసిన విశ్లేషణ పెద్ద వివాదానికి దారితీసింది. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది.

ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అనుసరించే నినాదాలు, ప్రాంతీయ గుర్తింపుల మధ్య వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. మేం ద్రావిడులం, ఇక్కడి ప్రజలు ఆర్యులు. మేం శివ భక్తులం, ఇక్కడి వారు శ్రీరాముడి భక్తులు. బీజేపీ రాముడిని దొంగిలించింది.

ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎప్పుడైనా 'హర హర మహాదేవ్' అని ఎందుకు అనరు? వారు కేవలం 'జై శ్రీరామ్' అంటారు అని వ్యాఖ్యానించారు. అలాగే శివుడిని 'పేదల దేవుడు'గా, రాముడిని 'ధనవంతుల దేవుడు'గా అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బీజేపీ తీవ్ర విమర్శలు..

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కమల దళం తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే రేవంత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను, దేవుళ్ల భక్తులను విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. రాముడు, శివుడి అనుచరుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా ఆ ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని హెచ్చరించారు.

సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని కాశీ కారిడార్ వరకు గతంలో కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు హిందూ ఆలయాలు, కార్యక్రమాలను వ్యతిరేకించిన చరిత్ర ఉందని భండారీ గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని సందర్భాల్లోనూ 'జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్' అని నినదిస్తారని స్పష్టం చేశారు. రామాయణంలో శ్రీరాముడే స్వయంగా లంకకు వెళ్లే ముందు మహాదేవుడికి పూజలు చేశాడని, ఈ ప్రాథమిక విషయాలు కూడా తెలియనివారు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande