విజయవాడలో 'పేదలకు పట్టాభిషేకం': 24,057 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
విజయవాడలో 'పేదలకు పట్టాభిషేకం': 24,057 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
Chandra Babu Naidu


ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, 30 సెప్టెంబర్ (హి.స.)

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (సెప్టెంబర్ 30) విజయవాడలో భారీ ఎత్తున ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. 'పేదలకు పట్టాభిషేకం' అనే కార్యక్రమం ద్వారా విజయవాడలోని సింగ్‌నగర్‌ సమీపంలో జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 24,057 కుటుంబాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలను అందజేయనున్నారు.

దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి యాజమాన్య హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న కొండ ప్రాంతాలు, కాలువ గట్లపై నివసించే పేదలకు ఈ నిర్ణయం శాశ్వత పరిష్కారాన్ని చూపనుంది. ముఖ్యంగా విజయవాడలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కొండ ప్రాంత వాసులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది.

ఈ క్రమబద్ధీకరణ కింద సుమారు 617 ఎకరాల (29.86 లక్షల చదరపు గజాలు) భూమిని లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ భూమి రిజిస్ట్రేషన్ విలువ సుమారు రూ. 9,800 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ. 24,297 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఒక్కో పేద కుటుంబానికి సగటున రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల విలువైన ఆస్తిపై శాశ్వత యాజమాన్య హక్కులు లభించనున్నాయి.

మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 15 మండలాలకు చెందిన వారు ఈ లబ్ధిదారులలో ఉన్నారు. వీరిలో 12,093 బీసీ కుటుంబాలు, 6,130 ఓసీ, 4,546 ఎస్సీ, 955 మైనార్టీ (ముస్లిం బీసీ) మరియు 333 ఎస్టీ కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande