కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: అభివృద్ధి పనులకు శ్రీకారం, భారీ భద్రత ఏర్పాటు
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కరీంనగర్ లో పర్యటిస్తున్నారు.
CM Revanth Reddy


కరీంనగర్‌, 30 సెప్టెంబర్ (హి.స.)

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన నేడు కరీంనగర్ మరియు సిరిసిల్ల ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయగా, పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

మధ్యాహ్నం కరీంనగర్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి, తొలుత పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని (IDOC) ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అదేవిధంగా కరీంనగర్ గడ్డపై ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. కొత్త కలెక్టరేట్ భవనంలో కలెక్టర్ ఛాంబర్‌తో పాటు వివిధ శాఖల అధికారుల కార్యాలయాలను పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

కరీంనగర్ పర్యటన ముగించుకున్నాక సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం సిరిసిల్లకు చేరుకుంటారు. అక్కడ అంబేడ్కర్ సర్కిల్ నుండి పాత బస్టాండ్, నేతన్న చౌక్ మీదుగా బహిరంగ సభా స్థలి వరకు భారీ పాదయాత్రగా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలో రూ. 1,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే ఘనమైన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. సీఎం పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సిరిసిల్ల సభలో సీఎం చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande