
మెదక్, 30 సెప్టెంబర్ (హి.స.)
మెదక్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెదక్-అక్కన్నపేట రైల్వే మార్గంలో గొర్రెల మందను మేతకు తీసుకెళ్తున్న సమయంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సుమారు 40కి పైగా మూగజీవాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఈ హృదయ విదారక సంఘటనతో గొర్రెల కాపరి కుకట్ల రెడ్డయ్య జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోయింది.
మంగళవారం రాత్రి సమయంలో మెదక్ నుంచి కాచిగూడ వైపు వేగంగా వస్తున్న రైలు.. రామాయంపేట మండలం తొనిగండ్ల - లక్ష్మాపూర్ శివారు ప్రాంతాల మధ్య రైల్వే పట్టాలు దాటుతున్న గొర్రెల మందను అకస్మాత్తుగా ఢీకొట్టింది. చీకటి కారణంగా రైలు వస్తున్న వేగాన్ని అంచనా వేయలేకపోయిన గొర్రెలు పట్టాలపైనే చిక్కుకుపోయాయి. ఈ ప్రమాద తీవ్రతకు సుమారు 40 గొర్రెలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొన్ని గొర్రెలు గాయపడ్డాయి. రైలు పట్టాలపై రక్తసిక్తంగా పడి ఉన్న మూగజీవాల కళేబరాలను చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
జీవనాధారమైన గొర్రెలే తమకు సర్వస్వమని నమ్ముకున్న కాపరి కుకట్ల రెడ్డయ్య, ఈ ప్రమాదంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. ఉన్నఫళంగా పదుల సంఖ్యలో జీవాలు చనిపోవడంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తనకున్న జీవాలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని, ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని ఆయన వాపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు మరియు స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే లైన్ల వెంబడి పశువులను, గొర్రెల మందలను తోలకెళ్లే సమయంలో కాపరులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi