
అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించిన వాతావరణ కేంద్రం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచనలు :-
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో సముద్రతీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే వీలుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాగులు, వంకల పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV