
హైదరాబాద్, 05 సెప్టెంబర్ (హి.స.)
శ్రీశైలం ఎడమగట్టు కేంద్రం నుంచి
జలవిద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జారీ చేసిన ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, అసమర్థ పాలన వల్లే తెలంగాణ ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విరుచుకుపడ్డారు. ఎల్ నినో పేరు చెప్పి రాష్ట్ర హక్కులను కేఆర్ఎంబీ దెబ్బతీస్తున్నా ప్రభుత్వం నోరు మెదపకపోవడం దారుణమన్నారు.
ఏ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తోందో బోర్డుకు కనిపించడం లేదా అని నిలదీసిన కేటీఆర్, ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం దృఢంగా పనిచేస్తుంటే, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపులను మూసివేసి ఏపీకి సహకరిస్తోందని ఆరోపించారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూలు నిబంధనలు ఒక్క తెలంగాణకే వర్తిస్తాయా అని ప్రశ్నించిన ఆయన, శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లను సీఎం రేవంత్ పూర్తిగా ఏపీకి ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుతో పాటు కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతుల పొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆగస్టు 21న శ్రీశైలంలో 169 టీఎంసీల నీరుండగా, కేవలం 15 రోజుల్లోనే 30 టీఎంసీలు తగ్గిపోయి 139 టీఎంసీలకు పడిపోయిందని, కల్వకుర్తి (కేఎస్ఐ) ద్వారా పరిమితంగా నీటిని ఎత్తిపోస్తుంటే మిగిలిన నీరంతా ఎక్కడికి పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో గట్టిగా ఎండగడతామని, ఈ అసమర్థ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..