
హైదరాబాద్, 05 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కోటా మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. గోదాముల్లో బియ్యం నిల్వలు అధికంగా పేరుకుపోవడం, అలాగే వాతావరణ పరిస్థితుల, సూపర్ ఎల్నినో (Super El Nino) ప్రభావం వంటి ముందస్తు అంచనాల కారణంగా రేషన్ లబ్ధిదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఒకేసారి 3 నెలల కోటా ఇవ్వడంతో గత నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల రద్దీ భారీగా కనిపించింది. చాలామంది కార్డుదారులు ఇప్పటికే తమ బియ్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లగా, ఇంకా ఎవరైనా తీసుకోని వారు ఉంటే ఇవాళ సాయంత్రంలోపు తమ కోటాను పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత గత నెలల కోటాను తిరిగి పొందే అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు.
ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేసినప్పటికీ, రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (e-PoS) యంత్రాల ద్వారా పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా పౌర సరఫరాల శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. మరోవైపు గోదాముల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, కొత్త ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది రాకుండా ఈ ముందస్తు పంపిణీ వ్యూహం రేషన్ బియ్యం నిల్వ నిర్వహణలో కీలక పాత్ర పోషించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు