విజయవాడ, 21 నవంబర్ (హి.స.)విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు. వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహమందిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.
‘‘పర్యావరణ క్షీణత, కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తోంది. 2025 జనవరిలో ఈ నివేదిక వస్తుంది. అది రాగానే విశాఖలో తగిన కార్యాచరణ చేపడతాం. గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగంతో కాలుష్యం తగ్గిస్తాం. థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఫ్లైయాష్ కూడా పొల్యూషన్‌కు కారణం. సిమెంట్ తయారీకి ఫ్లైయాష్ వాడి దీన్ని కట్టడి చేస్తాం. విశాఖ, గుంటూరులో ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీ చేపడుతున్నాం. దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం. ఎన్జీవోల భాగస్వామ్యంతో కాలుష్య నివారణకు చర్యలు చేపడతాం. డిసెంబర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. విశాఖలో కాలుష్య నివారణ చర్యలపై సమీక్షించి తగు చర్యలు తీసుకుంటాం’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల