తెలంగాణ, 13 డిసెంబర్ (హి.స.) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మరోసారి వస్తు సేవల పన్ను (GST) డిమాండ్ నోటీసులు పంపించింది. వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీపై జీఎస్టీ చెల్లించడం లేదని, బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు తమకు నోటీసు అందిన విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో జొమాటో కంపెనీ వెల్లడించింది. మొత్తం రూ. 803.4 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ నోటీసు వచ్చినట్లు తెలిపిది.' 2019 అక్టోబర్ 29 నుంచి 2022 మార్చి 31 వరకు వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు రూ. 401.70 కోట్లు ఉన్నట్లు మహారాష్ట్రలోని ఠాణె జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు. దానిపై వడ్డీ, పెనాల్టీ మరో రూ. 401.70 కోట్లు విధించారు.' అని రెగ్యులేటరీ ఫైలింగ్లో జొమాటో తెలిపింది. డిమాండ్ నోటీసుపై సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేస్తామని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన కేసుగా పేర్కొంది. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. గతంలోనూ జొమాటోకు ఈ తరహా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్