హసన్‌పర్తి, 26 జూలై (హి.స.)చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్‌పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్‌తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన కామ మాధవి హసన్‌పర్తి మండలం మడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేసే సమయంలో లక్ష్మీసాయి చిట్స్ పేరుతో భర్త వెంకటేశ్‌తో కలిసి చిట్టీలు నడిపారు. తమ వద్ద చిట్టీ వేస్తే ఒక నెల కంతు కట్టాల్సినా పనిలేదని, తామే కడతామని చెప్పడంతో అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణ 2021 నుంచి జూన్ 2023 వరకు ఆమెకు ప్రతినెలా రూ.12,500 చొప్పున రూ.2.75 లక్షలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించారు. చిట్టీ గడువు ముగిసినా కృష్ణకు మొత్తం రూ.3.95 లక్షలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారు. ఆయనతో పాటు పాఠశాల సిబ్బంది మరికొందరు కూడా ఆమె దగ్గర చిట్టీ కట్టి మోసపోయారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు కృష్ణ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని మోసం చేశారంటూ గురువారం ఉపాధ్యాయురాలు మాధవితో పాటు ఆమె భర్త వెంకటేశ్‌ను అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ తెలిపారు. మాధవి ప్రస్తుతం దామెర జడ్పీహెచ్‌ఎస్‌లో పని చేస్తున్నట్లు చెప్పారు.,
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు