కర్నూలు, 26 జూలై (హి.స.) కర్ణాటక, పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి పెరిగింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. గురువారం ఉదయం 8 గంటలకు నీటిమట్టం 1631.91 అడుగులకు, నీటి నిల్వ 101.91 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి 75,819 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 20 గేట్లను రెండు అడుగులు, 8 గేట్లను ఒక అడుగు చొప్పున ఎత్తి 75,774 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. డ్యాం ఎగునవ తుంగ, వర్దా నదుల నుంచి వరద పెరగడంతో ఏ క్షణంలోనైనా లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని టీబీపీ బోర్డు ఇంజనీర్లు తెలిపారు. కర్నూలు జిల్లాలోనూ తుంగభద్ర తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టరు పి.రంజిత్‌బాషా ఆదేశించారు. మరోవైపు శ్రీశైలం డ్యాంకు వరద పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,83,745 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన వరద కూడా రెండు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 1,92,302 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94.23 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం రోజుకు సగటున 16.50 టీఎంసీల నీరు డ్యాంలో చేరుతోంది. ఈ వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉంది.
,
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు