దిల్లీ: 11 జూలై (హి.స.) బాలీవుడ్ కమెడియన్, హోస్ట్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చెందిన కెనడా (Canada)లోని కేఫ్‌పై జరిగిన కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాల్పులపై కేఫ్ నిర్వాహకులు ఓ ప్రకటనలో స్పందించారు. జరిగిన ఘటన తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, హింసకు వ్యతిరేకంగా తాము దృఢంగా నిలబడతామని పేర్కొన్నారు.
‘రుచికరమైన కాఫీ, స్నేహపూర్వకమైన సంభాషణలతో కస్టమర్‌లకు ఆనందాన్ని పంచాలనే ఆశతో ఈ కాప్స్ కేఫ్‌ను ప్రారంభించాం. ఇక్కడ హింస చోటుచేసుకోవడం బాధాకరం. అయినా వెనక్కి తగ్గం’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఘటన నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. హింసకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడదామని పిలుపునిచ్చారు.
కెనడాలోని సర్రీలో ఉన్న ఈ ‘కాప్స్ కేఫ్’పై గురువారం కాల్పులు జరిగాయి. సిబ్బంది లోపల ఉండగానే జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆస్తినష్టం మాత్రం జరిగింది. తానే కాల్పులు జరిపానని ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్‌సింగ్ లద్ధీ ప్రకటించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ