మండి -, 11 జూలై (హి.స.)హిమాచల్ ప్రదేశ్‌లో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 91కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం.. మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. వరద ఉద్ధృతి కారణంగా కొట్టుకుపోయిన మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలు రహదారులపై పదుల సంఖ్యలో పడి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. హిమాచల్‌లోని పంగ్లుయెడ్ గ్రామంలో ఇటీవల రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారు. వారిలో నలుగురి మృతదేహాలు దాదాపు 150 కి.మీ. దూరంలో ఉన్న జ్వాలాపుర్‌లో లభ్యమవగా.. మరో ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు చాలాదూరం కొట్టుకుపోతుండడంతో వాటిని గుర్తించి.. వారి కుటుంబాలకు అప్పగించడం కూడా సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ