కేరళ, 1 ఆగస్టు (హి.స.)
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ విషాద ఘటనపై ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో 288 మంది మృతిచెందగా.. ఆర్మీ అధికారులు ఇప్పటివరకు వేయి మందిని రక్షించారు. లోకల్ పోలీసులతో పాటు దాదాపు 1500 ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వయానాడ్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పర్యటించారు. ఇవాళ ఉదయం కన్నూర్ విమానాశ్రయంలో రాహుల్, ప్రియాంకాలు దిగి.. రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశమైన చూర్మలాలో పర్యటన చేశారు. మరోవైపు మెప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. రాహుల్, ప్రియాంకాలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.
కాగా, వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ రెండు సార్లు గెలుపొందారు. ఈ ఏడాది ఎన్నికల్లోనూ వయనాడ్ లోక్సభ స్థానం విజయం సాధించారు. అయితే, రాయ్ బరేలి లో కూడా ఆయన గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీని వయనాడ్ ఉపఎన్నికల్లో పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడస్తోంది.
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు