బిజినెస్, 27 సెప్టెంబర్ (హి.స.)
ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్‌కు అక్టోబర్ 1 నుంచి పలు ఆదాయ పన్ను మార్పులు అమలులోకి రానున్నాయి. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదించి, తరువాత ఫైనాన్స్ బిల్లులో ఆమోదించిన విధంగా ఆధార్ కార్డ్, ఎన్టీటీ, టీడీఎస్ రేటు, డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌లలో ఈ మార్పులు ఉంటాయి.
ఆధార్ : పాన్ దుర్వినియోగాన్ని, అలాగే నకిలీ పాన్లను
నిరోధించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అక్టోబర్ 1 తరువాత ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు, అలాగే కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కచ్చితంగా ఆధార్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఆధార్ నంబర్ లేకపోతే, ఆధార్ ఎన్ రోల్మెంట్ ఐడీని ఇచ్చినా సరిపోయేది. ఇకపై అలా కుదురదు.
షేర్స్ బై-బ్యాక్ : డివిడెండ్ల మాదిరిగానే అక్టోబర్ 1 నుంచి షేర్ల బై-బ్యాక్ ద్వారా ఆదాయం పొందుతున్నవారిపై పన్నులు విధిస్తారు. అయితే షేర్ హోల్డర్ల స్థాయిని బట్టి ఈ పన్నులు ఉండనున్నాయి. అంటే అక్టోబర్ 1 నుంచి పెట్టుబడిదారులపై అధిక పన్నుల భారం పడనుంది. అంతేకాదు ఇకపై మూలధన లాభాలను లేదా నష్టాలను లెక్కించేటప్పుడు, షేర్ల కొనుగోలు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఆదాయ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు కొత్తగా 'డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్, 2024'ను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచే ఈ పథకం అమలు కానుంది.ఈ కొత్త స్కీమ్ ద్వారా గతంలో కంటే, చాలా తక్కువ సెటిల్ మెంట్ అమౌంట్‌తో వివాదాలు పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు 2024 డిసెంబర్ 31 లోపు పన్ను చెల్లించేవారి నుంచి చాలా తక్కువ సెటిల్మెంట్ అమౌంట్ తీసుకుంటారు. ఒక వేళ ఈ గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.
ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ టీడీఎస్ : 2024 బడ్జెట్లో చెప్పిన విధంగా, ఈ అక్టోబర్ 1 నుంచి ఫ్లోటింగ్ రేట్ బాండ్లు సహా, కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లపై 10% రేటుతో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ఉంటుంది. అయితే ఒక ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయం రూ.10,000 కంటే తక్కువగా ఉంటే, ఎలాంటి టీడీఎస్ ఉండదు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..