విజయవాడ, 14 జనవరి (హి.స.) జీబీఆర్ కాయిన్ పేరిట రూ.కోట్లలో వసూలు చేసి, మోసానికి పాల్పడిన కుర్రిమెల రమేశ్‌గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ వ్యాపారం పేరిట పెట్టుబడులను ఆకర్షించేందుకు రమేశ్‌గౌడ్ తన బృందంతో అర్భాటంగా ప్రచారాలు చేసినట్లు సీఐడీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సింగపూర్, దుబాయ్‌లలోనూ అట్టహాసంగా సమావేశాలను నిర్వహించి వినియోగదారులను భారీగా ఆకర్షించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో రూ.కోట్లలో వచ్చిన పెట్టుబడులతో రమేశ్ బృందం క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయకుండా సంస్థ పేరిట నకిలీ వెబ్‌సైట్‌తో మాయాజాలానికి పాల్పడినట్లు వెల్లడైంది. ప్రతి వినియోగదారుడికి యూజర్‌ఐడీలు, పాస్‌వర్డ్‌లు సృష్టించి నకిలీ వెబ్‌సైట్‌కు యాక్సెస్ ఇచ్చారు. అందులో వారి పేరిట పెట్టుబడులు, లాభాల వివరాలు కనిపించేలా చూశారు. సంస్థలో చేరి పెట్టుబడులు పెట్టిన తొలినాళ్లలో డబ్బులను ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించడం ద్వారా నమ్మకం చూరగొన్నారు. సంస్థలో చేరిన సభ్యుల ద్వారా మరికొందరిని చేర్పించేలా ప్రోత్సహించి... నిషేధిత గొలుసుకట్టు వ్యాపారానికి సైతం తెర లేపారు. అలా సుమారు రూ.100 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాక బోర్డు తిప్పేశారు. తొలుత వెబ్‌సైట్ హ్యాక్ అయిందని, తర్వాత వైరస్ బారిన పడిందని కట్టుకథలు చెప్పి చివరికి ముఖం చాటేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన మనోజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి ఇటీవల సూత్రధారి రమేశ్‌గౌడ్‌ను అరెస్ట్ చేశారు. ఈ మోసంలో... రమేశ్‌గౌడ్ కుటుంబ సభ్యులు, డ్రైవర్ పాత్రను తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల