విజయవాడ, 14 జనవరి (హి.స.)
సంక్రాంతి పండగకు ఉత్సాహంగా సొంతూరు బయలుదేరిన ఓ వ్యక్తి.. ఇంటికి చేరకుండానే దారిలో ప్రమాదానికి గురై దుర్మరణం పాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ వంతెనపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గజపతినగరం మండలం లింగాలవలసకు చెందిన కుమిలి పైడిరాజు (30) విజయవాడలో ఫాస్ట్‌ఫుడ్ సెంటరు నిర్వహణలో భాగస్వామిగా ఉన్నారు. మొగల్రాజపురంలో నివసిస్తున్న ఆయన తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు, బావమరిది సామంతుల సురేష్‌ను ఉదయం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో రావాలని చెప్పి, స్నేహితుడు బి.సూర్యనారాయణతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 8 గంటల సమయానికి కొవ్వూరు గామన్ వంతెనపై 55వ స్తంభం వద్దకు వచ్చేసరికి వాహనం అదుపు తప్పి ఎడమవైపు ఉన్న రక్షణ దిమ్మెను ఢీకొంది. పైడిరాజు తలకు, శరీరంపై తీవ్రంగా, సూర్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే పైడిరాజు మృతిచెందాడని నిర్ధారించారు. సూర్యనారాయణను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జగన్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల