ఢిల్లీ 15 జనవరి (హి.స.) దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిని రక్షించేందుకు తొలుత ససేమిరా అన్న అక్కడి ప్రభుత్వం.. పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రేన్‌ను లోనికి పంపించింది. అయితే, కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100మందికిపైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్‌తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు.
బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వ సాధారణం. వందల సంఖ్యలో ఉన్న పాడుపడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలలపాటు అందులోనే ఉండిపోతున్నారు. ఆహారం, నీటితోపాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల