తెలంగాణ, 6 జనవరి (హి.స.)
పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ ఘటనలో 47 మంది పాక్ సైనికులు మృతిచెందగా, 30 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ‘ఫిదాయీ సంగత్ బహర్ అలీ’గా గుర్తించారు.
ఇక ఈ దాడికి పాల్పడిన బిఎల్ఎ ప్రతినిధి వివరాలను మీడియాకు అందించారు. ‘‘తుర్బత్ నగరానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలోని బెహ్మన్ ఏరియాలో శనివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై మేం దాడి చేశాం. ఆ కాన్వాయ్‌లో మొత్తం 13 వాహనాలు ఉన్నాయి. వాటిలో 5 బస్సులు, 7 సైనిక వాహనాలు ఉన్నాయి. అవన్నీ కరాచీ నుంచి తుర్బత్ నగరంలో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వైపుగా వెళ్తుండగా ఈ దాడి చేశాం. దీంతో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమవగా, మిగతా బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో పాక్ ఆర్మీ కాన్వాయ్‌లో ఐంఐ 309 వింగ్, ఎఫ్‌సీ ఎస్ఐయూ వింగ్, ఎఫ్‌సీ 117 వింగ్, ఎఫ్‌సీ 326 వింగ్‌లకు చెందిన సిబ్బందితో పాటు రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జోయబ్ మొహసిన్ (ప్రస్తుత పోలీసు అధికారి) ఉన్నారు’
’ అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్