విజయవాడ, 2 జనవరి (హి.స.):నూతన సంవత్సరంలో ఏటా విజయవాడలో నిర్వహించే పుస్తక మహోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35వ విజయవాడ పుస్తక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. మొత్తం 294 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాల నిర్వహణకు రెండు వేదికలు ఏర్పాటు చేశారు. పుస్తకావిష్కరణలు జరిగే వేదికకు చెరుకూరి రామోజీరావు వేదికగా నామకరణం చేశారు. చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించే వేదికకు రతన్ టాటా ప్రతిభా వేదికగా పేరు పెట్టారు. ఈ ప్రదర్శన గురువారం నుంచి 12వ తేదీ వరకు 11 రోజులపాటు రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల