హైదరాబాద్ , 2 జనవరి (హి.స.): ఐదురోజుల క్రితం మాయమైన వ్యాపారి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవటంతో మిస్టరీగా మారింది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన విష్ణురూపాని(45) గోపీ అండ్ సన్స్ పేరిట కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఏళ్లుగా వీరి కుటుంబం ఉమ్మడిగా ఉంటూ నాలుగైదు చోట్ల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తుంది. గతనెల 29న రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటినుంచి బయటకెళ్తూ 12గంటల కల్లా వస్తానంటూ కుటుంబసభ్యులకు చెప్పాడు. అతని ఫోన్ స్విచ్చాఫ్ కావటం, రెండ్రోజులైనా ఆచూకీ లేకపోవటంతో ఇంట్లోవాళ్లు కంగారు పడ్డారు. 30న అతడి సోదరుడు మహేష్ రూపాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. విష్ణురూపాని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎస్సార్‌నగర్ బుద్ధనగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల