విజయవాడ, 2 జనవరి (హి.స.)
కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పల్నాడులో తొలిసారి పర్యటన విజయవంతమైంది. తమ గ్రామానికి సీఎం చంద్రబాబు వస్తున్నారన్న వార్త విన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తారు? ఏం మాట్లాడతారని ఉత్కంఠగా ఎదురుచూసిన యల్లమంద వాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది వరకు సీఎం జిల్లా పర్యటన రెండుసార్లు వాయిదా పడటంతో యల్లమంద పర్యటనపై కాస్త అనుమానాలు రేకెత్తాయి. చివరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఆకాశంలో హెలికాప్టర్ ధ్వని విన్న యల్లమంద గ్రామస్థుల్లో అప్పటి వరకు ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్లు గ్రామమంతా కలియతిరగడమే కాకుండా లబ్ధిదారుల ఇళ్లల్లో సొంత మనిషిలా మమేకమవడం.. కనిపించిన వారి యోగక్షేమాలు తెలుసుకుని హామీలిచ్చి భరోసానివ్వడం.. గ్రామాభివృద్ధికి కూడా హామీలివ్వడంతో గ్రామస్థుల్లో సంతోషం వెల్లివిరిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల