విజయవాడ, 7 జనవరి (హి.స.)
ఈనాడు - అమరావతి: మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన భూమిని యంత్రాంగం గుర్తించింది. పట్టణవాసులతోపాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎన్నారై కూడలికి సమీపంలో చినకాకాని వద్ద ఉన్న యార్లగడ్డ వెంకన్నచౌదరి అంకాలజీ రీసెర్చ్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ భూముల్లోని 8.5 ఎకరాలను కేటాయించాలంటూ ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ కేన్సర్ ఆసుపత్రిలో ఓపీ ఉండడం లేదు. నిరుపయోగంగానే ఉంది. ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే రోగుల రాకపోకలకు వీలుగా రవాణా, వసతి సౌకర్యాలున్నాయని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కేన్సర్ ఆసుపత్రిని వేరేచోటకు తరలించాలని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు.. డీఎంఈ, ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీకి లేఖ రాశారు. దీనికి ఆమోదం రావాల్సి ఉంది.
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని వందపడకల ఆసుపత్రి మంజూరు చేయించారు. మానవ వనరులను కేటాయిస్తూ గతేడాది నవంబరు 8న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం మంగళగిరి నడిబొడ్డున ప్రసిద్ధ లక్ష్మీనృసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న 30 పడకలను వంద పడకలకు విస్తరించేందుకు అవసరమైన స్థలం లేదని అధికారులు తేల్చి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల