హైదరాబాద్, 7 జనవరి (హి.స.)
ఇవాళ బీజేపీ కార్యాలయంలోపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గూండాలు రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలన్నారు రఘునందన్ రావు. నిన్న ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారని, గతంలో తమ సొంత ముఖ్యమంత్రిని దించడం కోసం చెప్పులు వేయడం మత కల్లోలాలు సృష్టించడం వారి చరిత్రలో భాగమే అని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్టుగా కనబడుతున్నదని, ఢిల్లీలో మా మాజీ ఎంపీ పొరపాటున దొర్లిన ఒక పదానికి వెంటనే వెనక్కి తీసుకొని తన హుందాతనాన్ని ప్రదర్శించారన్నారు.
కానీ నకిలీ గాంధీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ కొందరు రౌడీషీటర్లు కాంగ్రెస్ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిల్లిపోయినాయని, గుండాలకు, రౌడీషీటర్లకు, ఉగ్రవాదులకు, నక్సలైట్లకు పూర్తి స్వేచ్చని ఇచ్చి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేయమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చెప్పారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంపై, కార్యకర్తలపై, నాయకులపై దాడులకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు