అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో చోటుచేసుకున్న బాలుడి కిడ్నాప్ యత్నాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ ఏఎస్ఐ సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. బాలుడిని కిడ్నాపర్ల చెర నుంచి కాపాడి.. ఆలయ అధికారులు, పోలీసుల సమక్షంలో సురక్షితంగా తల్లికి అప్పగించారు. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య తన కుమారుడు శశి వజ్ర ఆరూష్(4)తో కలిసి దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఏడో అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు ఆరూష్ తల్లికి దూరమయ్యాడు. లావణ్య కుమారుడి కోసం మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికారు. కనిపించకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏఎస్ఐ ఆర్‌వీ సత్యనారాయణ అమ్మవారి దర్శనానికి వచ్చారు. లిఫ్ట్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒక బాలుడిని బలవంతంగా తీసుకెళ్తుండగా.. ఆ బాలుడు గట్టిగా ఏడుస్తూ కనిపించాడు. అనుమానం వచ్చిన ఏఎస్ఐ సత్యనారాయణ ఆ వ్యక్తులను ప్రశ్నించారు. దీంతో బెంబేలెత్తిన ఆ ఇద్దరు వ్యక్తులు బాలుడిని వదిలి పారిపోయారు. బాలుడిని తన వద్దకు తీసుకున్న ఏఎస్ఐ వెంటనే ఆలయ ఈఓ శీనా నాయక్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి.. బాలుడి తల్లి లావణ్యను గుర్తించి, వారి సమక్షంలో బాలుడు శశి వజ్ర ఆరూష్‌ను తల్లికి సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో బాలుడిని కాపాడిన ఏఎస్ఐ సత్యనారాయణను ఆలయ ఈఓ, చైర్మన్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ