
సంగారెడ్డి, 7 డిసెంబర్ (హి.స.)
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు చివరి
దశ ఎన్నికల వరకు కొనసాగుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశలుగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో, మొదటి దశ పోలింగ్ పూర్తయిన గ్రామ పంచాయతీలకు వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఎత్తివేయబడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామీణ ప్రాంతాలన్నింటిలో ఎన్నికల కోడ్ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
మొదటి, రెండవ దశల్లో ఎన్నికైన అభ్యర్థులు సహా ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లయితే, సంబంధితులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు