హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సరిహద్దు
ప్రాంతాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. గతంలో వచ్చిన తీవ్ర ఆరోపణలు, ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తం అయిన ఏసీబీ అధికారులు శనివారం రాత్రి ఒక్కసారిగా సోదాలు చేశారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్ పల్లి మండలం మాడ్డిలోని చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా అధికారులు వచ్చి సోదాలు చేయడం తో చెక్ పోస్టులోని సిబ్బంది షాక్ కు గురయ్యారు. తనిఖీల్లో లెక్కలు చూపించని రూ. 43,300 నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
అలాగే నారాయణపేట జిల్లాలో కూడా అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యంగా కర్ణాటక-తెలంగాణ సరిహద్దు (Karnataka-Telangana border) చెక్ పోస్టులపై ఈ దాడులు జరిపారు. ఇందులో లెక్కలు చూపని రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట వద్ద ఉన్న చెక్ పోస్ట్ లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ అధికారులకు పెద్ద మొత్తంలో నగదు దొరికినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రహదారిపై వెళ్తున్న వాహనాలను లక్ష్యంగా చేసుకున్న ప్రైవేట్ సిబ్బంది.. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..