
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)శుక్రవారం సమస్తిపూర్ నుంచి మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. నితీష్ కుమార్ నాయకత్వంలో తిరిగి బీహార్‌లో విజయం సాధిస్తామని మోడీ ప్రకటించారు. దీంతో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే అన్నట్టుగా అర్థమిస్తోంది.
నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్‌లో ఎన్డీఏ తన రికార్డును తానే బద్దలు కొడుతుందని.. అతిపెద్ద మెజారిటీని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాట పూర్తి నమ్మకంతో చెబుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏకు ఇప్పటివరకు లేని విధంగా అతిపెద్ద ఆధిక్యతను సాధించబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘మహారాష్ట్ర ప్రజలు మాకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. హర్యానా కూడా అదే చేసింది. మూడవసారి మమ్మల్ని ఎన్నుకుంది. మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ చాలా కాలంగా అధికారంలో ఉంది. గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో కూడా ఇదే చూశాము. గుజరాత్‌లో బీజేపీ రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారే ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ ఆ ధోరణిని అంతం చేసింది. ఇవన్నీ ఎన్డీఏ మంచి పాలన, ప్రజా సేవ, హామీ ఇచ్చిన అభివృద్ధి కోసం నిలుస్తుందని చూపిస్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ బీహార్‌లో తన రికార్డును తానే బద్దలు కొడుతుందని.. పూర్తి నమ్మకంతో చెప్పగలను.’’ అని మోడీ అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు