
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు అమరవీరులు, ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని అందుకు మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యమకారులకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇవాళ ఉదయం 'జాగృతి జనం బాట' పేరుతో కవిత జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనకు ముందు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం 1200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పామని వారి కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామన్నారు. 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాము. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని చోట్ల ఎంపీపీ, జడ్పీటీసీ టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..