ఉద్ధృతంగా వంశధార.. శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల్లో నేడు స్కూళ్లకు సెలవు
శ్రీకాకుళం, 3 అక్టోబర్ (హి.స.)తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దీని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా జీవనాడి అయిన వంశధార నదికి వరద పోటెత్తడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆకస్మిక వరదల (ఫ్ల
/srikakulam-schools-closed-due-to-vamsadhara-river-flood-alert


శ్రీకాకుళం, 3 అక్టోబర్ (హి.స.)తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దీని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా జీవనాడి అయిన వంశధార నదికి వరద పోటెత్తడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆకస్మిక వరదల (ఫ్లాష్‌ ఫ్లడ్‌) ముప్పు పొంచి ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని 10 మండలాల్లో ఉన్న అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది.

గత కొన్ని గంటలుగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా వంశధార నది పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 10 మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు ప్రకటించిన మండలాల్లో నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట ఉన్నాయని అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయా మండలాల ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande