
ముంబయి, 30 అక్టోబర్ (హి.స.)ముంబయిలో ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను బంధించిన (Children Hostage) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 17 మంది చిన్నారుల సహా 19 మందిని పోలీసులు రక్షించగా.. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో నిందితుడు కాల్పులు జరిపాడని, దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం.
ముంబయి పవయీ ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్ స్టూడియోలో (Acting Studio in Mumbai) రోహిత్ ఆర్య అనే వ్యక్తి గత నాలుగైదు రోజులుగా ఆడిషన్స్‌ను నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 8-14 ఏళ్ల వయసులోపు ఉన్న 100 మంది చిన్నారులు స్టూడియోకు వచ్చారు. కొంత సమయం తర్వాత చిన్నారులను బయటకు పంపించిన రోహిత్.. కొంత మందిని మాత్రం బంధించాడు. దీంతో భయాందోళనలకు గురైన పిల్లలు స్టూడియో కిటికీల నుంచి సాయం కోసం అరిచారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
నిందితుడికి సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని విడిచి పెట్టేందుకు అతడు నిరాకరించాడు. చిన్నారులకు హాని కలిగిస్తానని బెదిరించడంతో అప్రమత్తమైన రెస్క్యూ బృందం.. బాత్‌రూమ్ ద్వారా లోనికి ప్రవేశించి 17 మంది చిన్నారులు సహా 19 మందిని సురక్షితంగా రక్షించింది. ఆ సమయంలోనే నిందితుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఎయిర్‌గన్, కొన్ని రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు