న్యూ డిల్లీ, 4 అక్టోబర్ (హి.స.)
ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం ముగింపునకు కీలక ముందడుగు పడింది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాను హమాస్ (Hamas) అంగీకరించింది. ఈ తాజా పరిణామాలను భారత్ స్వాగతించింది. గాజాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని మోదీ (PM Modi) అభినందించారు.
గాజాలో శాంతి ప్రయత్నాల్లో నిర్ణయాత్మక పురోగతి సాధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బందీల విడుదలకు అంగీకారం కుదరడం శాంతిస్థాపనకు కీలక ముందడుగు అన్నారు. శాశ్వత, న్యాయమైన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తుందన్నారు.
గాజా యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేసి ప్రతిపాదనలు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ క్రమంలోనే హమాస్ తన అంగీకారం తెలపకపోవడంపై ట్రంప్ సీరియస్ అయ్యారు. అదివారం ఆరు గంటల్లోగా (అమెరికా కాలమానం ప్రకారం) ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హమాస్‌ను హెచ్చరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు