
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తవ్వివకుండా అభ్యర్థి సమర్పించిన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని జనరల్ అబ్జర్వర్ పి.ప్రశాంత్ జీవన్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు.
గురువారం మొదటి దశ పోలింగ్ కు సంబంధించి గురువారం నుండి (తేదీ: 27-11-2025 నుండి 29-11-2025 వరకు) ప్రారంభమైన ఈ నేపథ్యంలో శంషాబాద్ మండలం పెద్దతుప్ర గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెద్దతుప్ర, పెద్దతుప్ర తండా, ముచ్చింతల్, మదనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మదనపల్లి, మదనపల్లి కొత్త తాండ, మదనపల్లి పాత తాండ గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జనరల్ అబ్జర్వర్ పి.ప్రశాంత్ జీవన్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.
ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని జనరల్ అబ్జర్వర్ సూచించారు.
దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. జనరల్ అబ్జర్వర్ వెంట శంషాబాద్ ఎంపిడిఓ మున్ని, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు