
న్యూఢిల్లీ 10 డిసెంబర్ (హి.స.)
, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురికి జాతీయ హస్తకళల అవార్డులు దక్కాయి. మంగళవారం, విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023, 2024కు గానూ జాతీయ హస్తకళల అవార్డులను ప్రదానం చేశారు. 2023కు గానూ శిల్ప గురు అవార్డును డి.శివమ్మ అందుకున్నారు. ఈమె శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన వారు. తోలుపై రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ లీలలను ఆమె అద్భుతంగా చిత్రీకరించారు. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఆమెను అవార్డుకు ఎంపిక చేసింది. ఏటికొప్పాక బొమ్మల తయారీలో ప్రావీణ్యం ఉన్న గోర్సా సంతోశ్ 2024కు గానూ జాతీయ అవార్డును అందుకున్నారు. సంతోశ్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందినవారు. కలంకారి చేతి పెయింటింగ్‌లో విశేష కృషి చేసిన పి.విజయలక్ష్మి 2023కు గానూ జాతీయ హస్తకళ అవార్డును అందుకున్నారు. ఈమె నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందినవారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ