
విశాఖపట్నం, 10 డిసెంబర్ (హి.స.) ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sunder Pichai) తో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతి గురించి సుందర్ తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మాట్లాడుతూ డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని అన్నారు. విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం, అందుకు ప్రణాళికలను అమలు పరచడం గురించి గూగుల్ సీఈఓతో పాటు సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమాలోచనలను జరిపారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకో సిస్టంను ప్రోత్సహించాలని వారికి మంత్రి విన్నవించారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, క్యాలీబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులను పెడుతున్నందుకు గానూ గూగుల్ సీఈఓతో పాటు భేటీలో పాల్గొన్న గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలేలకు ధన్యవాదాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ దేశంలో క్లౌడ్ రీజియన్ ల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అంతేకాకుండా గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్స్ ద్వారా భారత్ లో స్టార్టప్ కంపెనీలకు తమ సంపూర్ణ మద్ధతు అందిస్తున్నామని వివరించారు. తమ సంస్థ విశాఖపట్నంలో ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ డేటా సెంటర్ అమెరికాయేతర దేశాల్లో అతిపెద్ద ఎఫ్డీఐ కానుందని వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్ కాన్ తో ఒప్పందం చేసుకున్నాం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV