
న్యూఢిల్లీ, డిసెంబరు 12: భారత పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేలా చూసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా దాఖలైన పలుపిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా గతంలో ఉన్న ఓటర్ల జాబితాలోని పేర్లే కాపీ, పేస్ట్ చేయరాదని పేర్కొంది. ఈ ప్రక్రియ ఓటర్ల జాబితాలోని వివరాలను తనిఖీ చేయడానికే కానీ, పౌరసత్వాన్ని గుర్తించడానికి కాదని తెలిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఈసీపై అపనమ్మకంతో ప్రారంభం కాకూడదని అన్నారు. ప్రతి ఓటరు పౌరసత్వాన్ని పరీక్షించడం ఈసీ పని కాదని చెప్పారు. ఓటరు జాబితాలో విదేశీయులు ఉన్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, దానిపై ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తాయని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల పర్యవేక్షణ అధికారం రాజ్యాంగబద్ధంగా ఈసీకి ఉందని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ