
బెంగళూరు, 21 డిసెంబర్ (హి.స.)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 24న ఉదయం 8:54 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుండి తన అత్యంత శక్తిమంతమైన LVM3-M6 (బాహుబలి) రాకెట్‌ను ప్రయోగించనుంది. అమెరికాకు చెందిన 'AST స్పేస్‌మొబైల్' రూపొందించిన 6,500 కిలోల బరువైన 'బ్లూబర్డ్-6' (BlueBird Block-2) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇది కక్ష్యలోకి చేర్చనుంది. ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటికే శాటిలైట్ అనుసంధాన ప్రక్రియ పూర్తయి, రాకెట్‌ను రెండో ప్రయోగ వేదికపైకి తరలించారు.
ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవానికి దారి తీయనుంది. 'బ్లూబర్డ్' ఉపగ్రహం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సామాన్య స్మార్ట్‌ఫోన్లకు నేరుగా (Direct-to-Cell) హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. దీనివల్ల సెల్ టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా నిరంతర ఇంటర్నెట్, కాల్ కనెక్టివిటీ లభిస్తుంది. ఇస్రో వాణిజ్య విభాగమైన 'న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్' (NSIL) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రయోగం, అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేయనుంది. ఆసక్తి ఉన్నవారు షార్‌లోని 'లాంచ్ వ్యూ గ్యాలరీ' నుండి ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV