
కోల్‌కతా, 21 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని కేవలం రాజకీయాల కోణంలో, భారతీయ జనతా పార్టీ (BJP) లెన్స్‌తో చూడటం ఒక పెద్ద పొరపాటని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, సంఘ్‌ను అర్థం చేసుకోవాలంటే ఇతర సంస్థలతో పోల్చడం మానుకోవాలని సూచించారు. మీరు సంఘ్‌ను మరో సేవా సంస్థగా భావిస్తే పొరపడినట్లే.. అలాగే చాలా మంది సంఘ్‌ను బీజేపీ కోణంలో చూస్తుంటారు, అది కూడా ఒక పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు. సంఘ్ అనేది ఒక ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి అని, దానిని కేవలం రాజకీయ అనుబంధంతో ముడిపెట్టడం వల్ల అసలైన ఉద్దేశం మరుగున పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
సంఘ్‌ను అర్థం చేసుకోవాలంటే దూరంగా ఉండి పోలికలు చూడటం కాకుండా, దాని కార్యకలాపాల్లో భాగం కావాలని భగవత్ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని, కేవలం రాజకీయ పార్టీలకు పరిమితం కాదని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందని, సంఘ్ కేవలం మార్గదర్శకత్వం, సలహాలు మాత్రమే ఇస్తుందని ఆయన గతంలో కూడా పలుమార్లు పేర్కొన్నారు. కోల్‌కతా పర్యటనలో ఆయన చేసిన ఈ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సంఘ్ తన వంద ఏళ్ల ప్రయాణంలో హిందూ సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఆశించడం సరికాదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV