తెలంగాణ/ఏ.పీ, 5 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కులగణన అసమగ్రంగా, అశాస్త్రీయంగా ఉంది. ఈ నివేదిక వాస్తవాలకు దూరంగా ఉంది.నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. చట్టరూపంలో తీసుకొచ్చి అమలు చేసేందుకు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్ది బిల్లు రూపంలో తీసుకురావాల్సింది. మొక్కుబడిగా, తూతూమంత్రంగా చేశారు. ఓబీసీల పట్ల కపటప్రేమను ఒలకబోస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా.. సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారు. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు వేసిన చర్యగానే దీన్ని భావించాలి. ఇది కాంగ్రెస్ మానసిక ఆలోచనకు అద్దం పడుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన పదాలు వాడారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని పేర్కొన్నారు. మండల్ కమిషన్ లోనూ 51 శాతం, బీఆర్ఎస్ సమగ్రకుటుంబ సర్వేలోనూ.. 52 శాతం బీసీలున్నారని వెల్లడైంది. మరి ఈ సంఖ్య ఎలా 46 శాతానికి వచ్చింది. 4 కోట్ల జనాభాలో దాదాపు 6 శాతం తగ్గుదల బీసీలకు చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతోంది. 12 శాతం ముస్లింల జనాభాను చూపిస్తూ.. 2 శాతం ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని చూపించడం దేనికి నిదర్శనం.” అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..