విజయవాడ, 5 ఫిబ్రవరి (హి.స.)
కొవ్వూరు పట్టణం: నగ్న వీడియోల పేరిట యువతిని బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అసలు ఎటువంటి వీడియోలు లేకుండానే.. తనవద్ద ఉన్నాయంటూ బెదిరించి నిందితుడు ఆమె నుంచి డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలిందని కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఓ వసతి గృహంలో ఉంటున్న నిడదవోలుకు చెందిన యువతిని ఆమె స్నేహితురాలు కాజా అనూష దేవి భర్త నినావత్ దేవనాయక్ అలియాస్ మధు సాయికుమార్ మోసం చేసి రూ.2.53 కోట్లు దఫదఫాలుగా జమ చేయించుకున్నాడు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం మంగళవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపించారు. దర్యాప్తులో భాగంగా దేవనాయక్ చరవాణి, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా బాధితురాలికి చెందిన ఎటువంటి నగ్న చిత్రాలు, వీడియోలు లేవని తేలిందన్నారు. ఉన్నాయని బెదిరించి నగదు కాజేశాడన్నారు. ఆ సొమ్ముతో బంగారం, వెండి ఆభరణాలు, కారు, ద్విచక్ర వాహనం, అపార్టుమెంటు కొనుగోలు చేశాడన్నారు. స్థిరాస్తి దస్త్రాలు, 938 గ్రాముల బంగారం, 2 కేజీల 250 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.1.81 కోట్లు ఉంటుందన్నారు. ఈ కేసులో దేవనాయక్ భార్య అనూష పాత్ర విషయమై విచారణ చేస్తున్నామన్నారు. నిందితుడు గుంటూరు జిల్లా ఓబుల నాయుడుపల్లికి చెందిన వాడని, చినకాకానిలో నివాసం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల